janasamayam.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 6:10 pm Posted by : JANA SAMAYAM

బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్

పోక్సో (POCSO) కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అరెస్ట్, ఆపై చర్లపల్లి జైలుకు తరలింపు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మైనర్ బాలికపై లైంగిక దాడి మరియు వేధింపులకు పాల్పడినట్లు మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై కేసు నమోదైంది. అప్పటినుంచి పరారీలో ఉన్న భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలించారు. విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ (LOC) కూడా జారీ చేశారు.

చివరకు హైకోర్టులో ముందస్తు బెయిల్ లేదా అరెస్ట్ నుంచి తక్షణ రక్షణ లభించకపోవడంతో శనివారం రాత్రి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అనంతరం పోలీసులు భగీరథ్‌కు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మేడ్చల్ మేజిస్ట్రేట్ నివాసంలో ఆయనను హాజరుపరిచారు.

బాధితురాలైన మైనర్ బాలిక మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం (Statement) మరియు కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు భారీ భద్రత నడుమ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆయనను చర్లపల్లి కేంద్ర కారాగారానికి (జైలుకు) తరలించారు.