ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో వర్షపాతం పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల లభ్యత, ప్రత్యామ్నయ పంటల సాగు, విత్తనాల సరఫరా, వ్యవసాయ, విద్యుత్తు, మంచినీటి తదితర రంగాలపై ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సవిÖక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఎల్ నినో వల్ల భూగర్భ జలాలు, చెరువులు, ఇతర నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా కంది, మొక్కజొన్న, పెసలు, మినుములు, శనగ, వేరుశనగ, సోయాబీన్, జొన్న, సజ్జ తదితర పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు చిరుధాన్యాల సాగు వైపు మళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. పంటల సాగులో వైవిధ్యీకరణ ద్వారా తక్కువ నీటి వినియోగంతో మెరుగైన ఆదాయం పొందే అవకాశాలను రైతులకు వివరించాలన్నారు.వరి సాగు వల్ల కలిగే లాభనష్టాలతో పాటు ప్రత్యామ్నయ పంటల సాగు ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలు, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మద్దతు ధరలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.ప్రత్యామ్నయ పంటల సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన విత్తనాల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. కంది, పెసర, మినుము, శనగ, వేరుశనగ, సోయాబీన్, జొన్న, సజ్జ తదితర పంటల విత్తనాలకు సంబంధించి సబ్సిడీ వివరాలతో కూడిన సమగ్ర ప్రొఫార్మాను సిద్ధం చేయాలన్నారు.మండలాలు, గ్రామాల వారీగా రైతుల నుంచి విత్తనాల డిమాండ్‌ను సేకరించి, అవసరమైన విత్తనాల కొరకు ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని సూచించారు.జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రాబోయే రెండు రోజుల్లోగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల తదితర శాఖలు తమ పరిధిలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన చర్యలతో నివేదికలు అందించాలన్నారు.వ్యవసాయ శాఖ నోడల్ శాఖగా వ్యవహరిస్తూ అన్ని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. గ్రామ, మండల స్థాయి అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఏయే పంటలను కొనుగోలు చేస్తారు, వాటికి వర్తించే మద్దతు ధరలు, కొనుగోలు విధానం తదితర అంశాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయంతో పాటు నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, ఉద్యానవన, పశుసంవర్ధక, గ్రావిÖణాభివృద్ధి తదితర రంగాలపై ప్రభావాన్ని అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వేసవిలో.మంచినీటి సమస్య రాకుండా సమ్మర్ యాక్షన్ ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. రబీ సాగు కంటే ముందునుండే పంటల సాగుపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్,జిల్లా గ్రావిÖణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్తు, మున్సిపల్ కమిషనర్, జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ, , నీటిపారుదల డివిజన్ల ఈఈలు జిల్లా పంచాయతీ డి ఎల్ పి ఓ లు , తదితరులు పాల్గొన్నారు.

