నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అర్ధరాత్రి వేళ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని మూడవ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్లాంట్‌లోని మూడవ యూనిట్ (Unit-3) ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులు ట్రయల్ రన్ (Trial Run) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో బాయిలర్‌కు ఆయిల్ సప్లై చేసే పైప్ నుంచి లీకేజీ ఏర్పడింది. అదే సమయంలో కింద భాగంలో వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో, లీకైన ఆయిల్ కాస్తా వెల్డింగ్ నిప్పురవ్వలకు తగిలి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు యూనిట్ మొత్తానికి మరియు అక్కడ ఉన్న కేబుల్స్ వైర్లకు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన ప్లాంట్ సిబ్బంది మరియు అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఆ ప్రాంతానికి కొద్దిగా దూరంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో కొన్ని కేబుల్స్ మాత్రమే కాలిపోయాయని, ప్రధాన యంత్రాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా మొదటి యూనిట్‌లో దాదాపు 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ట్రయల్ రన్ సమయంలో ఇలాంటి చిన్నపాటి లీకేజీలు, సాంకేతిక సమస్యలు సహజమేనని ప్లాంట్ అధికారులు చెబుతున్నప్పటికీ… ప్లాంట్‌లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కార్మికులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.




