కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గ పోరు కొత్తేమీ కాదు. పదవులు, సీట్ల కోసం నేతలు వీధులకెక్కడం ఆ పార్టీకి అలవాటే అనే విమర్శలకు బలం చేకూరుస్తూ తాజాగా హైదరాబాద్ గాంధీభవన్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లీడర్ల మధ్య ‘అహం’ ఎంతలా పెరిగిపోయిందో చెప్పడానికి నిన్న జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశమే ఒక ఉదాహరణ.
హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కీలక నేత మహ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, వేదికపై అజారుద్దీన్ పక్కన ఉన్న కుర్చీలో ఎవరు కూర్చోవాలనే విషయమై మైనార్టీ నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ హజ్రీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
చిన్నగా మొదలైన ఈ వాగ్వాదం క్షణాల వ్యవధిలోనే తీవ్రరూపం దాల్చింది. ఒకరిపై ఒకరు లంఘించుకుంటూ చొక్కాలు పట్టుకున్నారు. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో ఉస్మాన్ హజ్రీ.. ఫిరోజ్ ఖాన్ చెంప చెల్లుమనిపించాడు. ఈ తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోవడంతో గాంధీభవన్ ఒక్కసారిగా అరుపులు, కేకలతో మారుమోగిపోయింది.
“ఏంది పహిల్వాన్‌లా రెచ్చిపోతున్నావ్?” అని వీహెచ్ గద్దిస్తే.. “అవును.. నేను పహిల్వాన్‌నే!” అంటూ ఉస్మాన్ హజ్రీ ఎదురు తిరిగాడు.
గలాటాను గమనించిన సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు (వీహెచ్) ఇద్దరినీ విడదీసేందుకు మధ్యలోకి వెళ్లారు. కానీ, కొట్టుకునే మూడ్‌లో ఉన్న ఆ నేతలు వీహెచ్‌ను కూడా పక్కకు తోసేస్తూ కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న వీహెచ్.. “పహిల్వాన్‌లా ప్రవర్తిస్తున్నావ్” అని మండిపడగా, ఉస్మాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా “అవును, నేను పహిల్వాన్‌నే” అంటూ అక్కడున్న వారికే సవాల్ విసిరాడు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌లు చూస్తుండగానే ఈ రచ్చ జరగడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. క్రమశిక్షణ లేని ఇలాంటి వాతావరణంలో సమావేశం నిర్వహించలేమని భావించి, రివ్యూ మీటింగ్‌ను మధ్యలోనే రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఈ ‘గాంధీభవన్ ఫైటింగ్ వీడియో’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “సమీక్షలు చేసుకోవడానికి వచ్చారా.. కుస్తీ పడటానికి వచ్చారా?” అంటూ నెటిజన్లు కాంగ్రెస్ నేతల తీరుపై సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా, ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ పరువును మరోసారి బజారున పడేసిందనేది మాత్రం వాస్తవం.




