క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అందరి కళ్లూ చెన్నైలోని చేపాక్ మైదానం పైనే ఉన్నాయి. టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు.
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ.. ‘థలా’ అభిమానులకు ఈ వార్త తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే మోకాలి, పిక్క గాయాల కారణంగా ధోనీ తొలి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, సీజన్ సాగుతున్నా ఇప్పటివరకు ధోనీ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా మైదానంలోకి అడుగుపెట్టలేదు. డగౌట్‌లో కూడా కనిపించకపోవడంతో విశ్లేషణలు మొదలయ్యాయి. 44 ఏళ్ల వయసున్న ధోనీ, తన శరీరం సహకరించకపోవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో 2021 ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో ధోనీ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు:
“నా చివరి వన్డే మ్యాచ్ రాంచీలో ఆడాను. అలాగే నా చివరి టీ20 (ఐపీఎల్) మ్యాచ్ కూడా నా సొంత మైదానమైన చెన్నై చెపాక్‌లోనే ఆడాలని ఆశిస్తున్నాను.”
ఆ మాట చెప్పి సరిగ్గా ఈ ఏడాదికి ఐదేళ్లు పూర్తయింది. ప్రస్తుత లీగ్‌లో చెన్నై జట్టుకు హోమ్ గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ చివరిది. దీంతో ఈ మ్యాచ్‌లోనే ధోనీ బరిలోకి దిగి, మ్యాచ్ అనంతరం తన ఐపీఎల్ రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఒక కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ, ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు తాను ఇచ్చిన సలహాను పంచుకున్నాడు. “నేను రుతురాజ్‌తో ఒకటే చెప్పాను.. జట్టును నీకు నచ్చిన రీతిలో, నీ సొంత ఆలోచనలతో నడిపించు” అని వ్యాఖ్యానించాడు. ఈ మాటలను బట్టి ధోనీ ఫ్రాంచైజీ బాధ్యతల నుంచి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం పూర్తిగా తప్పుకోవడానికి సిద్ధమయ్యాడని స్పష్టమవుతోంది.
ఒకవేళ ఇదే నిజమైతే, ఐదుసార్లు చెన్నైకి ఐపీఎల్ ట్రోఫీలు అందించి, భారత క్రికెట్ చరిత్రలో ఎనలేని రికార్డులు సృష్టించిన ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లే. అయితే చివరి నిమిషంలో ధోనీకి వేలి గాయం కూడా అయిందనే వార్తలు వస్తుండటంతో, ఆయన అసలు మ్యాచ్ ఆడి వీడ్కోలు పలుకుతాడా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
ధోనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు క్రికెట్ లోకం ఊపిరి బిగబట్టి ఎదురుచూడాల్సిందే



