జైలు గోడలు దూకి పరారైన ఓ పోక్సో (POCSO) కేసు నిందితుడు, పోలీసుల భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం స్థానిక జైలుకు తరలించారు. అయితే, సోమవారం తెల్లవారుజామున నిందితుడు అధికారుల కళ్లు గప్పి, అత్యంత చాకచక్యంగా జైలు నుంచి పరారయ్యాడు. నిందితుడు తప్పించుకున్న విషయం గమనించిన జైలు అధికారులు వెంటనే అప్రమత్తమై, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
జైలు నుంచి ఖైదీ పారిపోవడంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, జిల్లా సరిహద్దు పరిసర ప్రాంతాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో నిందితుడు పట్టుబడే పరిస్థితి వచ్చింది.
నాలుగు వైపుల నుంచి పోలీసులు తనను చుట్టుముట్టడం, ఎలాగైనా మళ్లీ పట్టుబడతానని గ్రహించిన నిందితుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. పోలీసులకు దొరకడం ఇష్టం లేక, నానో యూరియా తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో స్పందించిన పోలీసులు నిందితుడిని కాపాడి, వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని వనపర్ప్రభుత్వాస్పత్రికి తరలించారు.l
ఈ భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిందితుడు జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు.



