వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రేపు (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-బీజేపీ) హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పిందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.
ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో ధరలు ఉన్నాయని.. ప్రభుత్వం విధిస్తున్న 4 శాతం అదనపు వ్యాట్ (VAT), రూ. 1 రోడ్డు సెస్ వల్ల సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని పార్టీ పేర్కొంది.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు మారుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ధరల పెరుగుదల వల్ల రవాణా రంగానికి, రైతులకు, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాల ఖర్చులు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో రేపటి నిరసనల రూట్‌మ్యాప్‌ను ఖరారు చేశారు రేపు ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వినూత్న రీతిలో ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతాయి.
స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కీలక నేతలు ఈ ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొని నిరసనల అనంతరం ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు (RDO), ఎంఆర్‌ఓలకు (MRO) వినతిపత్రాలు అందజేయనున్నారు.
ఈ పోరాటంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, ప్రజాసంఘాలు మరియు సాధారణ ప్రజలు కూడా కలిసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.




